Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారు. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2022
Read Also: Dharmana Prasad Rao: రాజధానిగా ఉండే అర్హత విశాఖకు మాత్రమే ఉంది
తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు ఐదువేల కోట్ల రూపాయల భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఐదువేల కోట్లు కాదు ఐదు కోట్ల రూపాయల భూములు తమ ఆక్రమణల్లో ఉన్నా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నాని వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి తన ఆరోపణలను నిరూపిస్తే ఆ భూములను రాసి ఇచ్చేసేందుకు రెడీ అన్నారు. అందుకు సిద్ధం అయితే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయం దగ్గర విజయసాయిరెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబా గుడికి ఎప్పుడు వచ్చేది సాయిరెడ్డే చెప్పాలని హితవు పలికారు.