కర్నూలు జిల్లా ఆదోనిలో బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు మాయం కావడం కలకలం రేపుతోంది. A.E.P.S(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సెంటర్) నుండి వేలి ముద్ర వేసి డబ్బు డ్రా చేసినట్లు ఖాతాదారులకు మెసేజ్ రావడంతో ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే మళ్లీ డబ్బు విత్ డ్రా అయినట్లు వస్తున్న మెసేజ్ లతో వారి ఆందోళన మరింత పెరుగుతోంది.
ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు ఏం జరిగిందో తెలీక టెన్షన్ పడుతున్నారు. బ్యాంకులో ఫిర్యాదులు చేసినా ఖాతాలకు విత్ డ్రా అయిన డబ్బు జమకావడం లేదు. సొమ్మును బ్యాంకులో దాచుకుంటే ఇలా డ్రా కావడం పట్ల ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ ఖాతాల్లో డబ్బులు మాయం అయ్యాయంటూ.. స్టేట్ బ్యాంకులో ఫిర్యాదు చేశారు కార్వాన్ పేటకు చెందిన మురళీకృష్ణ, మండగిరికి చెందిన రామాంజనేయులు. 85 వేలు ఖాతాలో డ్రా చేసారని ఆదోని త్రీటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు డా.గోవిందరాజులు. ఈ వ్యవహారానికి బాధ్యులయినవారిపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు తిరిగి తమ ఖాతాల్లో వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.