టీడీపీలో పనిచేసిన బీసీ నేతలే సీఎం జగన్‌కు దిక్కయ్యారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారు.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని సెటైర్లు వేశారు. ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించిన ఆయన.. టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందని.. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్. కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని సూచించారు. ఇక, ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలు చేసినట్లేనా..? అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న.. సీఎం జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా బీసీలంతా టీడీపీ పక్షానే ఉన్నారు.. త్వరలోనే బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు.
Read Also: Andhra Pradesh: బెండపూడి విద్యార్థుల ప్రతిభ.. సీఎం ఫిదా..
ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా..? అని నిలదీశారు బుద్దా వెంకన్న.. ఆర్. కృష్ణయ్యను తెచ్చి వైసీపీలో బీసీ నాయకులను అవమానించారన్న ఆయన.. కృష్ణయ్య టీడీపీ తరపున పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. టీడీపీలో పని చేసిన బీసీ నేతలే జగన్‌కు దిక్కయ్యారన్న ఆయన.. ఏ పార్టీ నన్ను గుర్తించలేదని కృష్ణయ్య మాట్లాడటం వింతగా ఉందన్నారు. మంద కృష్ణ మాదిగ ఎప్పుడూ పదవులు గురించి మాట్లాడలేదే..? అని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప.. బీసీల మీద జగన్‌కి ప్రేమ లేదని.. కృష్ణయ్యకు ఎంపీ ఇస్తే.. బీసీలు అందరినీ ఉద్దరించినట్లు కాదన్నారు.. అదానీకి ఇచ్చిన విధంగా బీసీలకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వండి అని సలహా ఇచ్చారు.
2019లో మీ పార్టీ కోసం పని చేసిన బీసీలెవరూ జగన్‌కు కనిపించ లేదా..? అని ప్రశ్నించారు వెంకన్న.. గడప గడపకూ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు.. అందుకే బీసీ మంత్రులతో బస్సు యాత్ర పేరుతో మూకుమ్మడిగా పంపిస్తున్నారు.. అంటే ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే ప్రజల పై దాడి చేయాలని సంకేతాలా..? అని మండిపడ్డారు.. బీసీలకు అండగా ఉన్న నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబులే.. అచ్చెంనాయుడిని పార్టీ అధ్యక్షులుగా చేశారు.. మీరు చేయలేదే..? అని నిలదీశారు.. సీఎం జగన్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పీకే రిపోర్ట్ రెండు ఉంటాయి.. బీసీలు చంద్రబాబు పాలన రావాలని కోరుకుంటున్నారు.. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న.