Site icon NTV Telugu

Pawan kalyan Delhi Tour: అలర్ట్‌ అయిన బీజేపీ.. ఢిల్లీ నుంచి పవన్‌కు పిలుపు..?

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందనే ప్రచారం సాగుతోంది.. తన విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్‌గా స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీకి పోం.. ఇక్కడే తేల్చుకుంటాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. హస్తిన నుంచి పవన్‌కు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్‌ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం జనసేనాని హైదరాబాద్‌లో ఉన్నారు.. దీంతో, ఆయన ఢిల్లీ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. భారతీయ జనతా పార్టీతో గ్యాప్ ఉందని ఇటీవలే కామెంట్ చేశారు పవన్‌… రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌ను కోరిన తనపై విమర్శలు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నారు.. అయితే, ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. దీంతో, పవన్‌ హస్తినకు వెళ్తారా? వెళ్తే.. బీజేపీతో ఎలాంటి విషయాలపై చర్చ జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది.

Read Also: JanaSena: జనసేన నేతలకు షాకిచ్చిన కోర్టు..

అయితే, తాజాగా, పవన్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. కమలానికి జనసేన కటీఫ్ చెప్పినట్టే అనే సంకేతాలు ఇచ్చాయి.. బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్‌.. బీజేపీ తనకు ఇప్పటికీ వైసీపీ పోరాటం విషయంలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదన్నారు. ఇంకెంత కాలం వెయిట్ చేయాలంటూ ప్రశ్నించారు. అందుకే తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని.. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖ చిత్రం చూస్తారంటూ కామెంట్‌ చేశారు.. ఇంత పెద్ద జనసేన పార్టీ పెట్టుకుని, ప్రాణాలిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు ఉండి.. తాను బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడం ఏంటని.. అసలు తనకు సిగ్గు ఉందా అంటూ ఉండవల్లి తనను తిడుతూ ఉంటారన్నారు. కానీ, తానేమీ ఆ తిట్లకు బాధపడడం లేదన్నారు. ఎందుకంటే పెద్ద వాళ్లు తిడితే ఆశీస్సులా తీసుకుంటా. బీజేపీ మీద తనకు గౌరవం ఉంది. అలా అని చెప్పి తన స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేనని ఘాటుగా స్పందించారు పవన్‌.

ఇక, జనసేనాని హాట్‌ కామెంట్లు చేసిన కొద్ది క్షణాల్లోనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయవాడలో పవన్‌ బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు.. ప్రభుత్వ విధానాలపై కలిసికట్టుగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.. ఇదే సమయంలో.. టీడీపీ-జనసేన దగ్గర అయినట్టే.. మళ్లీ కలిసి పోటీచేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. చంద్రబాబు-పవన్‌ అంతసేపు మాట్లాడారంటే.. ఏదో కీలకమైన నిర్ణయానికే వచ్చిఉంటారని.. ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరుగొచ్చు అనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే, పవన్‌ కల్యాణ్ చేజారిపోయే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు.. వెంటనే ఆయన్ను హస్తినకు రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.

Exit mobile version