ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది… ఈ సారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.. అయితే, రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు తెస్తారన్నారు.. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి అని బీజేపీ స్పష్టంగా చెబుతోందని మరోసారి గుర్తుకు చేశారు.. మూడు రాజధానులు అంటూ వెళ్తూ రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీపై ఫైర్ అయ్యారు. దేశంలో అసెంబ్లీ తక్కువ జరిగిన రాష్ట్రం ఒక్క ఏపీయేనని ఎద్దేవా చేసిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌కి లేజిస్లేటివ్ మీద నమ్మకం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు.
Read Also: Andhra Pradesh Crime: పెళ్లింట విషాదం.. శోభనం రాత్రి పడకగదిలోనే వరుడు మృతి..!
ఇక, అసెంబ్లీ వేదికగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ మాధవ్.. విద్యార్థులు కూడా ఉద్యోగాలు, ఉపాధి లేక రాష్ట్రం నుంచి వలసలు వెళ్లిపోయే స్థితికి వచ్చిందన్న ఆయన.. 9, 10 షెడ్యూల్ లో ఏపీకి రావాల్సిన వాటిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అడిగారు అని హైదరాబాద్‌లో మనకి హక్కు ఉన్న వాటిని వదిలేశారని ఆరోపించారు. మరోవైపు, సీపీఎస్ ని కూడా హామీ ఇచ్చిన విధంగా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓపీఎస్ రద్దు చేయాలని బీజేపీ తరపున మేం అసెంబ్లీలో డిమాండ్ చేస్తామన్నారు ఎమ్మెల్సీ మాధవ్.