గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్‌తో పాటు ఆ ప్రాంతానికి జిన్నా పేరు ఎలా కొనసాగిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. దేశ విభజనకు కారణమైన వ్యక్తి పేరు ఇంకా కొనసాగటం సరికాదన్నారు. స్వాతంత్ర్య సమరయోధులపేరును పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Also:దొర అహంకారాన్ని అణిచి వేయాలి: షర్మిళ
అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ ఖండించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. జిన్నా దేశభక్తుడు, వాజ్‌పేయి దేశద్రోహి అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం దీనిపై మండిపడ్డారు. దేశ విభజనకు, అనేక మంది మృతికి కారణమైన వ్యక్తి జిన్నా అని ఆయన పేరును ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆ పేరును తీసేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. జిన్నాపేరు తీసేసి అబ్దుల్‌కలాం లేదా గుర్రం జాషువా పేరును పెట్టాలని సూచించారు.