అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన ఎలుగు సమీపంలోని పొలాల్లోకి నెమ్మదిగా పరుగులు పెట్టింది.
ఎలుగు బంటి సంచరించే దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు నరసన్న పేట తహశీల్దార్ కార్యాలయం దగ్గరకు చేరుకున్న టెక్కలి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ప్రపుల వేంకట శాస్త్రి ఎలుగుబంటి సంచరించే పరిసరాలను పరిశీలించారు. గత రెండు సంవత్సరాలుగా వయస్సు మళ్ళిన ఎలుగు బంటి పోలాకి, సంత బొమ్మాళి, నరసన్నపేట మండలాల్లో సంచరిస్తుందన్నారు. ప్రస్తుతం జీడి పంట సీజన్ కావడంతో ఆహారం కోసం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో చొరబడుతోందన్నారు. ఇంత వరకూ ఎవరిపై దాడి చేయనప్పటికీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ఎలుగుబంటి కదలికలపై నిఘా పెడుతున్నామని టెక్కలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేంకటశాస్త్రి వెల్లడించారు.
Covid 19: ఉత్తర కొరియాలో తొలి కరోనా మరణం.. వేగం పుంజుకున్న కరోనా