బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆయనను ఎంపికచేశారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉద్యమకారుడైన కృష్ణయ్యను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది. తెలంగాణలో బీసీ ఉద్యమాలు చేసిన కృష్ణయ్యను జగన్ గుర్తించారు.కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, కానీ ముందుగా జగన్ అవకాశం ఇచ్చారన్నారు. ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనేది సరైన ప్రచారం అన్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు ఎదగాలనే కృష్ణయ్య పదవుల కోసం పనిచేస్తారనేది అపోహ మాత్రమే అన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో ఆర్ కృష్ణయ్య అనేక అంశాలు ప్రస్తావించారు. కృష్ణయ్య బీసీ అగ్రనేతగా ఎలా ఎదిగారనేది ఆయన వివరించారు.
నేను పదవి కావాలనుకుంటే కలెక్టర్ అయ్యేవాడిని. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవిని వదులకున్నా. నేను పదవుల కోసం పనిచేయలేదన్నారు. బీసీలకు అండగా వుండడానికి నేను శక్తివంచనలేకుండా పనిచేస్తానన్నారు ఆర్ కృష్ణయ్య. తనకు రాజ్యసభ పదవి రావడం వల్ల బీసీల ఔన్నత్యం పెరుగుతుంది. రెండు రాష్ట్రాల బీసీల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానన్నారు.
కృష్ణయ్యకు పదవి ఇచ్చి జగన్ ఇబ్బందులు పడుతున్నారనేది అపోహ మాత్రమే అన్నారు. కృష్ణయ్యకు పదవి ఇవ్వడం సరైనదేనా అని మీరు సర్వే చేయండి. ఎవరైనా తప్పని అంటే నేను గుండు గీయించుకుంటానన్నారు. 1976 నుంచి నేను ఉద్యమంలో వున్నానన్నారు. తనను వాడుకుని టీడీపీ గెలిచిందన్నారు. ఒక్కోసారి తానే పార్టీలను వాడుకున్నానని చెప్పారు. వైసీపీ మాత్రం బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇచ్చింది. బడుగుల నేతలు బాడుగ నేతలు అవుతున్నారనే విమర్శల్ని తప్పుబట్టారు. కొంతమంది బీసీ నేతలు జాతి అభివృద్ధి కోసం తమ ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు కృష్ణయ్య. తాను పార్టీలు మారలేదని, పార్టీలను ఉద్యమం వైపు తిప్పుకుంటున్నానన్నారు. గతంలో దమ్మున్న నేతలు కూడా బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వలేదన్నారు. బీసీల నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న తాను బడుగు, బలహీనవర్గాల స్వరంగా మారతానన్నారు.