Robbery in Narsapur Express: రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.. రైల్వే వ్యవస్థ సిగ్నలింగ్ పై ఆధారపడి నడుస్తుంది.. ఇక, రాత్రి సమయంలో మరింత జాగ్రత్తగా లోకో పైలట్‌లు ఈ సిగ్నల్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.. అదే అదునుగా భావించిన దొంగల రెచ్చిపోయారు.. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లోకి దూరారు.. ముగ్గురు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడి కుడి రైల్వే స్టేషన్ సమీపంలోని 146/06 మైలురాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్‌ను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ పడటంతో లోకో పైలట్ రైలును ఆపేశారు. వెంటనే దొంగల ముఠా సభ్యులు రైల్లోకి చొరబడి ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోని ఇద్దరు మహిళల మెడలో 68 గ్రాముల బంగారు గొలుసులు, ఓ మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసు దోచుకున్నారు. ఎస్-5 బోగిలోనూ చోరీకి యత్నించగా ప్రయాణికులు కేకలు వేయడంతో పరారయ్యారు. ఆ సమయంలో రైలు 35 నిమిషాలపాటు నిలిచిపోయింది. విజయవాడ చెందిన ప్రయాణికురాలు శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ తెలిపారు. కాగా, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు..