ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే తెనాలిలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ లో భారీ అవకతవకలు జరిగాయి. నకిలీ బంగారం తాకట్టు పెట్టు కొని దొంగ రుణాలు మంజూరు చేశారు బ్యాంక్ ఉద్యోగులు… చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఐదుగురు ఖాతాదారుల సాయంతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. సాధారణ తనికీల్లో భాగంగా బ్యాంక్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి మొత్తం 29 అకౌంట్లలో 42లక్షల రూపాయలు లోన్ తీసుకున్న ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
వీరంతా గత మార్చి చివరి నుండి విడతలవారీగా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టారని ఈ కుంభకోణంలో రుణం తీసుకున్న ఐదుగురు ఖాతాదారుల వివరాలు గుర్తించామని మరింత లోతుగా ఆడిట్ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. బ్రాంచ్ మేనేజర్,తో పాటు బంగారం తనకా పెట్టుకునే అధికారి(అప్లైజర్) కుమ్మక్కయి రుణాలు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. మరికొన్ని అకౌంట్లలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం పెట్టి ఎక్కువ డబ్బు రుణాలుగా పొందటం కొన్ని కేసుల్లో బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బు రుణం పొందినట్లు గమనించారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్నాయనీ ఈ వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించి నగదును రికవరీ చేస్తామనీ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
కాగా గుంటూరు జిల్లాలో బ్యాంక్ లలో ఈ తరహా మోసాలు ఖాతా దారులను ఆందోళనలో ముంచుతున్నాయి. అవసరం కోసం భద్రత కోసం బ్యాంక్ లో బంగారం పెడుతుంటే బ్యాంక్ సిబ్బంది ఇలా మోసాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతా దారులు.రాబోయే రోజుల్లో ఇంకెన్ని బ్యాంక్ ల లో ఈ తరహా మోసాలు జరుగుతాయో, ఎన్ని బంగారు నగలు మాయమవుతాయి చూడాలని అంటున్నారు.
వాస్తవానికి ఒక ఖాతాదారునికి లోన్ ఇవ్వాలంటే సవాలక్ష షూరిటీ లు శత కోటి నిబంధనలు పెట్టీ బ్యాంక్ ల చుట్టూ తిప్పడం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం బ్యాంకు సిబ్బంది చేసే పని. కానీ ఇలా అడ్డదారిలో రుణాలు మంజూరు చేసే విషయంలో మాత్రం కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారని, నిజంగా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, అగ్రికల్చరల్ లోన్ ,గోల్డ్ లోన్ కావాలని వచ్చేవారికి సంతకాలు , అడ్వకేట్ లీగల్ ఒపీనియన్, తో పాటు నోటికి వచ్చిన నిబంధనలు చెప్పడం బ్యాంక్ సిబ్బందికి వెన్న తో పెట్టిన విద్య.
ఖాళీ ఇళ్ల స్థలాలు పెట్టుకొని లోన్ లు ఇవ్వలేమని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు అనుకున్నా అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన కొద్దిమంది సిబ్బంది అండ ఉంటే మాత్రం బ్యాంకు లోన్ తీసుకోవడం తీసుకున్న సొమ్ము లోన్ లు కట్టకుండా ఎగ్గొట్టడం కొంతమందికి మహా సరదాగా ఉంటుంది. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి లక్షల సొమ్ము కాజేయాలన్న ఎంత ధైర్యం ఉండాలి అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో వినపడుతున్నాయి. కాకి బంగారంతో లక్షలు లోన్లు తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని జనం కోరుతున్నారు.
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోనసీమ జిల్లా పేరు మార్పు