Bandla Ganesh Reacts To Vijayasai Reddy Tweets Over Ramoji Rao: మీకు ప్రతిరోజు మంచి సమాచారం అందిస్తూ.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతానని ఎంపీ విజయసాయిరెడ్డికి సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సూచించాడు. మార్గదర్శి సంస్థలో సోదాలపై విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా చేసిన విమర్శలకి గాను.. బండ్ల గణేష్ అలా స్పందించాడు. అంతేకాదు.. రామోజీరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బండ్ల తప్పుపట్టాడు. ఆయన ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించారని పేర్కొంటూ.. విజయసాయి రెడ్డి చేసిన ప్రతీ ట్వీట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్. అసలేం జరిగిందంటే..
మార్గదర్శి సోదాల నిమిత్తం విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారెంట్‌ని నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రామోజీరావుని టార్గెట్ చేస్తూ.. విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా విరుచుకుపడ్డారు. సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావ్, సమాచారం అడిగితే స్టే అంటావ్, మళ్లీ పారదర్శకత – ప్రజాస్వామ్యమంటూ నీతులు చెప్తావంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. ఏ తప్పూ చేయకపోతే విచారణను ఎదుర్కోవాలని అన్నారు. అంతేకాదు.. కొండపల్లి సీతారామయ్య రచనలను ప్రచురించే జీజే రెడ్డికి రామోజీ వెన్నుపోటు పొడిచారని… జీజే రెడ్డి ఆస్తిని, కొండపల్లి రచనలను దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు. నాలుగడుగులు వేయలేని పరిస్థితికి రామోజీ వయసు చేరుకుందని, పాప పరిహారానికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఇఫ్పటికైనా పేపరుకు పెట్టుబడి పెట్టిన జీజే రెడ్డి వారసులెవరో వెతికి, వాళ్లకు డబ్బులిచ్చి ఆయన రుణం తీర్చుకోమని పేర్కొన్నారు.
ఇలా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. జీజే రెడ్డిని రామోజీ రావు వెన్నుపోటు పొడిచిన విషయం మీకెవరు చెప్పారు? అని ప్రశ్నించాడు. కేవలం తెలుసుకోవాలనే ఆతృతతోనే అడుగుతున్నానన్నాడు. రామోజీ రావు 25 వేల కుటుంబాలకు ప్రతి నెలా జీవనోపాధి కల్పిస్తున్నారని, ఆతృతతో ఈ విషయం మీకు చెప్తున్నాన్నాడు. మీకు ప్రతి రోజు మంచి సమాచారం, మంచి విషయాలు చెప్తూ.. మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతానన్నాడు. రామోజీరావు వయస్సు 86 సంవత్సరాలని, ఇంకో పదేళ్లు కూడా బ్రహ్మాండంగా ఉంటారని, ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిచారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డికి విజ్ఞప్తి చేశాడు.