అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్‌జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే కాదు.. ఈనెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిద్ధమైంది.. దీనిపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..
ఈనెల 29వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు భూమన కరుణాకర్ రెడ్డి.. రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం అంటూ పిలుపునిచ్చారు.. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయి.. అందుకే సీఎం వైఎస్ జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.. సీఎం జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.. ఇక, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా ధనిక రైతులు పాదయాత్ర కొనసాగుతోందని విమర్శించిన భూమన.. చంద్రబాబు నిర్ణయాలు రాయలసీమ వాసులను క్షోభకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు.. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు రాయలసీమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన.. రాయలసీమకు ఇప్పటికీ తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నాడని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..