ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు.
ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడిందని, ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందుంటే వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో ముందుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని, వైద్యశాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోనే ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో ప్రజలకు ఏం ప్రయోజనం జరుగుతోందని ఆయన మండిపడ్డారు.