ఏపీలో వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై 1,116 అక్రమాల పేరుతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏపీలో విధ్వంసకర, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తోందని.. రివర్స్ టెండరింగ్ ఏపీని తిరోగమనంలోకి నెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ మంత్రులు నోరులేని మూగజీవులు అని చురకలు అంటించారు. కార్పొరేషన్‌లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
కోనసీమ అల్లర్లు సీఎం జగన్ స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని అచ్చెన్నాయుడు విమర్శించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో సంపూర్ణ మద్యపానం అమలు చేస్తానని జగన్ చెప్పలేదని నిరూపిస్తే ఉరేసుకుంటానన్నారు. ఏపీలో శంకుస్థాపన చేసిన గ్రీన్ కోతో దావోస్ వెళ్లి ఒప్పందం చేసుకున్నామని చెబితే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనపై చేసిన కామెంట్లకు స్పందిస్తూ.. కుక్కలు ఎన్నో మొరుగుతాయని.. వాటన్నింటికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
YCP MLC Duvvada Srinivas: జగన్ కోసం ఆత్మాహుతి దళం సభ్యుడిగా మారతా
మరోవైపు మహానాడును వల్లకాడు అని కామెంట్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. సీతారం సిద్ధంగా ఉండాలని.. ఆయన్ను వల్లకాడుకి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి అనుచితంగా మాట్లాడుతున్న తమ్మినేని తమ జిల్లా వాసి కావడంతో సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. టీడీపీ భిక్షతో నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడటం సరికాదన్నారు.