బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని… ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం వల్ల కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వైపు వచ్చే కొద్ది తుఫాన్ బలహీన పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు దూసుకొస్తోంది. తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
విమానాలపై అసని తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల విశాఖకు వచ్చే పలు విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో తన 23 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఎయిర్ ఏషియాకు చెందిన ఢిల్లీ- విశాఖ, బెంగళూర్- విశాఖ, ముంబై- రాయపూర్- విశాఖ , ఢిల్లీ- విశాఖ విమానాలు రద్దు అయ్యాయి. దీంతో పలు చెన్నైకి వెళ్లాల్సిన పలు విమానాలను కూడా రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ పట్నం, జైపూర్, ముంబై నుంచి చెన్నైకి వెళ్లే 10 విమాన సర్వీసులను రద్దు చేశారు.