ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్‌తో మీమ్‌ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. టీడీపీ పొలిటికల్ వింగ్ పోస్ట్ చేసిన ఫోటోలోని బస్సు ప్యాసింజర్లను తీసుకెళ్లడం లేదని వివరణ ఇచ్చారు. అటు బస్సు రూఫ్ లీక్ కూడా కాలేదని స్పష్టం చేశారు.
అయితే ఆర్టీసీ బస్సుకు టార్పాలిన్ ఎందుకు కప్పారన్న విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఇటీవల విద్యాసంస్థలు తెరుచుకోవడంతో ఆర్టీసీపై నమ్మకంతో విద్యాశాఖ స్కూల్ పుస్తకాల పంపిణీ బాధ్యతను తమకు అప్పగించిందని ఆర్టీసీ తెలిపింది. అందులో భాగంగానే ఆ బస్సులో పుస్తకాలను రవాణా చేశామని పేర్కొంది. స్కూళ్లు ప్రారంభం కావడంతో పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటం కోసం జిల్లా కేంద్రాల నుంచి భారీ సంఖ్యలో బస్సుల్లో పుస్తకాలను రవాణా చేస్తున్నామని వెల్లడించింది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రవాణా చేయాల్సి ఉండటం, వర్షా కాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు కిటికీలను టార్పలిన్లతో కప్పి ఉంచామని ఆర్టీసీ స్పష్టం చేసింది. తాము చేస్తున్న మంచిపని పట్ల ప్రతికూలతను, వెరిఫై చేయని రూమర్లను ప్రచారం చేయడం తమకు షాకిచ్చిందని ఆర్టీసీ తెలిపింది. టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్టును వెంటనే డిలీట్ చేయాలని.. ఈ విషయంలో తాము న్యాయసలహా తీసుకుంటామని.. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఆర్టీసీ హెచ్చరించింది. దీంతో స్పందించిన టీడీపీ పొలిటికల్ వింగ్ సదరు పోస్టును డిలీట్ చేస్తామని ప్రకటించింది.