APCC Chief Narreddy Tulasi Reddy About Polavaram Project: పోలవరం.. సంవత్సరాలు గడిచిపోతున్నా, ఈ ప్రాజెక్ట్ వ్యవహారం మాత్రం కొలిక్కి రావట్లేదు. రబ్బరు సాగదీసినట్టు.. దీనిని నాన్చుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇదంతా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్లేనని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. ఆ మూడు ప్రభుత్వాల కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే, 2016 నాటికే పోలవరం పూర్తయ్యేదని అన్నారు.
శుక్రవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక, జాతీయ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. ఇంకా రూ. 30 వేల కోట్లు కావాలన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే శక్తి లేదని.. అలాగే ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్మించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని జోస్యం చెప్పారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలవరం పూర్తవుతుందని వెల్లడించారు. అంతకుముందు బీజేపీ పార్టీ దేశానికి పట్టిన శనిగ్రహమని.. వైసీపీ, టీడీపీలు ఏపీకి పట్టిన రాహుకేతువలని తీవ్రస్థాయిలో తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.