Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్‌-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్‌ చేపడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా 1.3 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుజ్లాన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని నారా లోకేష్ వెల్లడించారు. ఉరుకొండ వద్ద ఉన్న బ్లేడ్ల తయారీ యూనిట్ విస్తరణతో పాటు కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 2016లో ప్రారంభమైన అనంతపురం సుజ్లాన్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే సుమారు 2,000 మందికి ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది స్థానిక యువత ఉండటం సంతోషకరమన్నారు. స్థానిక ఐటీఐలను దత్తత తీసుకుని శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

సుజ్లాన్ సంస్థ వర్క్‌ఫోర్స్‌లో 40 శాతం మంది మహిళలు ఉండటం అభినందనీయమని నారా లోకేష్ అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో నెలవారీ సమావేశాలు నిర్వహించి పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెట్టుబడులు ఆలస్యం కాకుండా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు.