Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు డేటా చౌర్యం అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా పెగాసస్ అంశంపై కమిటీ నివేదికను పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం జరిగిందని తాము నిర్ధారించినట్లు భూమన తెలిపారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సభ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక రానుంది. 85 పేజీల ఆధారాలతో కమిటీ అసెంబ్లీ ముందు నివేదికను ప్రవేశపెట్టనుంది.
Read Also:YS Sharmila: కేసీఆర్ ఒక గజదొంగ.. దమ్ముంటే అరెస్ట్ చేయండి
కాగా ఈ అంశంపై పెగాసెస్ హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పెగాసస్ కమిటీ మధ్యంతర నివేదికను స్పీకర్‌కు ఇచ్చామని తెలిపారు. రేపు సభలో టేబుల్ చేయనున్నామని.. గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు హోం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన ఆధారాలను బట్టి స్పష్టమైందన్నారు. 85, 86 పేజీల నివేదిక ఇచ్చామని.. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సమాచారం చౌర్యం అయినట్లు తేలిందని పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు వంటి మరిన్ని అంశాలు తేల్చాల్సి ఉందని జక్కంపూడి రాజా చెప్పారు. పెగాసస్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో మంగళవారం చర్చ చేపట్టే అవకాశం ఉందన్నారు.