వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ తన మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ కూర్పు తుది దశకు చేరుకుంది. గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితాను నేడు పంపనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరిని కొనసాగించాలి.. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి, సీఎం జగన్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని.. అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా సీఎం నిర్ణయం తీసుకుంటారని సజ్జల చెప్పారు. అయితే దాదాపుగా మంత్రివర్గ జాబితా సిద్ధమైంది. 10 మంది మంత్రులకు కొనసాగింపుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా 15 మందికి క్యాబినెట్ లో చోటు దక్కనుంది. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం.