రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం బూటకపు రోడ్డు శ్రమ దానాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ఇక, పవన్ కల్యాణ్ ది ప్యాకేజీ కోసమే ఆరాటం తప్ప… ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు మంత్రి శంకర్ నారాయణ.. పవన్ పార్టీ పెట్టింది తన స్వలాభం కోసం… తన విలాసవంతమైన జీవితం గడపడం కోసమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు, రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడని మండిపడ్డ ఆయన.. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని గ్రహించాలన్నారు. కాగా, ఇవాళ రాజమండ్రితో పాటు.. అనంతపురం జిల్లాలోనే పర్యటించనున్న పవన్ కల్యాణ్.. అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.