రైతులకు ద్రోహం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అమరావతిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయి.. గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా?? వీరందరికీ మా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు.. దీనిపై దత్త పుత్రుడు కూడా సమాధానం చెప్పాలి అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు కాకాణి.. రైతుల కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోంది.. రైతుల బాగుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు.. 5,500 కోట్ల రూపాయలను సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎందుకు హర్షించ లేకపోతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Read Also: Rains-Memes: గ్యాప్ ఇవ్వరా.. కొంచెం. వరుణుడిపై నెటిజన్ల ఫ్రస్టేషన్.
పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం 6,680 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు మంత్రి కాకాణి.. రైతులకు రాష్ట్రం, కేంద్రం చెల్లించాల్సిన మూడు వంతులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపిన ఆయన.. కేంద్ర మంత్రి కూడా అభినందించారని గుర్తుచేశారు.. కేంద్రం వాటా భరిస్తామని స్పష్టం చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు.. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉందా?? అంటూ మండిపడ్డ ఆయన.. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే బట్టలు ఆరేసుకోవటమే అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. డ్రిప్ ఇరిగేషన్ పేరుతో 700 కోట్లు బకాయి పెట్టి వెళ్లాడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు మూలంగానే రాష్ట్రంలో అనేక కంపెనీలు మూతపడ్డాయన్నారు.
