ఏపీ ఇంటర్ బోర్డ్ ఇంటర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియను ఈనెల 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరి బాబు వెల్లడించారు. ప్రవేశాలను ఆయా కళాశాలలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 20నుంచి జులై 20వరకు మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా శేషగిరి బాబు పేర్కొన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తామని శేషగిరి బాబు వెల్లడించారు. సీట్ల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుందని, మొదటి విడతలో రిజర్వేషన్ సీట్లు మిగిలిపోతే రెండో విడత ప్రవేశాల్లో వాటిని జనరల్ మార్పు చేస్తారన్నారు.
సెక్షన్‌కు 88మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృత్తివిద్య, పారామెడికల్ కోర్సులకు ఒక సెక్షన్‌కు 30మంది చొప్పున అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. కళాశాలల బయట మొత్తం సీట్లు, భర్తీ, మిగులు వివరాలతో నోటీసుబోర్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదులో విద్యార్థి తండ్రి పేరుతో పాటు తల్లి పేరునూ నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.