Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా తేలుస్తామని హైకోర్టు తెలిపింది.
Read Also: Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
కాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు.. ప్రభుత్వ శాఖల వారీగా ఎంతమందిని నియమించారు.. ఈ విషయంలో విధి విధానాలేంటి అన్న పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఓ పీఠాధిపతి సలహా మేరకు పిటిషనర్ జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమించామని ఏజీ ఇచ్చిన వివరణను తప్పుబట్టింది. పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని.. వారు దేవాలయాల వ్యవహారాలకే పరిమితం కావడం ఉత్తమమని వ్యాఖ్యానించింది. ఇష్టానుసారంగా సలహాదారుల నియామక విషయం చిన్నదేమీ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
