కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో గానీ, అనాథాశ్రమంలో గానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాకుండా, కోర్టును అవమానించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Read Also: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్
అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయమై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం తనకు సీనియారిటీ కల్పించకపోవడంతో గతేడాది వెంకటరమణ డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమల్లో ఏడాది జాప్యం చోటుచేసుకున్నందుకు డీఈవోను బాధ్యుడిగా తేల్చింది. దీంతో డీఈవో క్షమాపణ కోరారు. అయితే క్షమాపణ బదులు వారం పాటు సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.