ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.
ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మరో జిల్లాను ఏర్పాటుచేయనుంది. గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ను మాత్రం రెండు జిల్లాలుగా మార్చనుంది ప్రభుత్వం.

దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు కానుంది రాష్ట్రం. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల ప్రతిపాదన చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి. క్రిష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు వున్నాయి. ఈ జిల్లాల్లో మరో లోక్ సభ నియోజకవర్గం జిల్లా కానుంది. ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే కొత్త జిల్లాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.