Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్

  • 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రతిపాదన
  • నారా లోకేష్ సూచనతో తీసుకున్న కీలక నిర్ణయం
  • సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రభుత్వ ఆందోళన
  • దేశంలోనే ఏపీ తొలి రాష్ట్రంగా నిలిచే అవకాశం
Ap Sm Ban

Ap Sm Ban

Social Media Ban in AP : మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!

సోషల్ మీడియా వినియోగం వల్ల తలెత్తుతున్న అనర్థాలపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే 90 రోజుల్లో (మూడు నెలల్లో) దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 13 ఏళ్లలోపు వారికే కాకుండా, 13 నుంచి 16 ఏళ్ల వయసు గల వారు కూడా సోషల్ మీడియా వాడాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోందని, అందరూ అంగీకరిస్తే ఈ వయసు వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలవ్వడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా, సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమాయక యువత డిజిటల్ మోసాల బారిన పడుతుండటం. సోషల్ మీడియాలో వస్తున్న వల్గర్ మెసేజ్‌లు, వీడియోలు పిల్లల నైతికతను దెబ్బతీస్తుండటం. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఒత్తిడికి గురవ్వడం వంటి వాటిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

“అల్టిమేట్‌గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది” అని చంద్రబాబు సభలో ఉద్ఘాటించారు. రాజకీయ పార్టీలైనా, సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే సోషల్ మీడియా దుష్ప్రభావాలకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దేశంలోనే పిల్లల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.

AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు