YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం

  • ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిన విద్యార్థులు
  • ప్రైవేట్ బడుల వైపు పెరిగిన చేరికలు
  • కూటమి సర్కార్‌పై జగన్ తీవ్ర విమర్శలు
  • నాడు-నేడు ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు
Jagan

Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తీవ్రంగా పడిపోవడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యుడైస్ ప్లస్ (UDISE+) అధికారిక గణాంకాలను ఆధారంగా చూపుతూ, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగం దారుణంగా దెబ్బతింటోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం మానేసి, ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ బడుల్లో పడిపోతున్న చేరికలు.. ప్రైవేట్ వైపు విద్యార్థుల మొగ్గు

యుడైస్ ప్లస్ నివేదిక వివరాల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,450కు పడిపోయింది. అంటే ఒక్కసారిగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గానని గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కి, ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కి పడిపోవడం ఆందోళనకరమని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2023-24లో 45,53,380 ఉండగా, 2025-26 నాటికి 48,40,296కు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, అధికారిక యుడైస్ నివేదికకు అస్సలు పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు.

కార్పొరేట్ విద్యా సంస్థల లబ్ధి కోసమే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం

నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కూటమి ప్రభుత్వం ఈ రకమైన విధానాలను అమలు చేస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచడం వల్ల, ప్రైవేట్ విద్యా సంస్థల్లో లభించే విద్య ఖర్చును భరించలేని పేద, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్యకు పూర్తిగా దూరమయ్యే ఘోర పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు

గత తమ ప్రభుత్వ హయాంలో (2019-24) ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్‌కు పోటీగా తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలు తెచ్చామని జగన్ గుర్తుచేశారు. ‘మన బడి – నాడు నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 56,703 సంస్థల్లో తాగునీరు, పారిశుధ్యం, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు. డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ (BYJU’S) కంటెంట్‌తో ఉచిత ట్యాబ్‌లు పంపిణీ చేయడంతో పాటు, 6వ తరగతి నుంచి పైతరగతులకు 62 వేల ఐఎఫ్‌పీ (IFP) డిజిటల్ బోర్డులు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు అందించడంతో పాటు 3వ తరగతి నుంచే టోఫెల్ (TOEFL) శిక్షణ, ఐబీ (IB) విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు అధికారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వివరించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే తమ ఆశయమని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.