AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!

Chandrababu Naidu

Chandrababu Naidu

AP: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న వేలాది మంది పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారమే ప్రాధాన్యంగా డైట్ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. పెంచిన ఈ కొత్త చార్జీలు తక్షణమే (నేటి నుంచే) అమల్లోకి రానున్నాయి. కేవలం డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా, విద్యార్థుల కడుపునిండా నాణ్యమైన, బలవర్ధకమైన భోజనం అందించేలా సరికొత్త మెనూను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం.. హాస్టల్ విద్యార్థులకు వారంలో ఏకంగా ఆరు రోజుల పాటు కోడిగుడ్లు, మూడు రోజుల పాటు చికెన్ వడ్డించనున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ పాలు, పౌష్టికాలనిచ్చే పండ్లు తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. దీనివల్ల నిరుపేద విద్యార్థులకు హాస్టళ్లలోనే సంపూర్ణ ఆహార భద్రత లభించనుంది.

తరగతుల వారీగా పెరిగిన డైట్ ఛార్జీలు ఇవే:

* 3 నుంచి 6వ తరగతి: ఇప్పటివరకు ఉన్న రూ.1,150 నుంచి రూ.1,265కు పెంపు.

* 7 నుంచి 10వ తరగతి: గతంలో ఉన్న రూ.1,400 నుంచి ఏకంగా రూ.1,600కు పెంపు.

* ఇంటర్, ఆపై పైచదువుల విద్యార్థులకు: రూ.1,600 నుంచి రూ.1,800కు పెంచుతూ నిర్ణయం.

ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. డైట్ చార్జీల పెంపుతో బీసీ విద్యార్థులకు మరింత రుచికరమైన, శుచికరమైన పోషకాహారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యానికి భరోసా కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.