ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖలో ఎవరైనా ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా.. బంద్ చేసినా.. ఆందోళనలకు దిగినా ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు సరికాదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీతో చర్చలు జరుపుతోంది. ఐఆర్ రికవరీ, ఇతర అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రుల కమిటీ వెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సీఎం జగన్ సమక్షంలోనే మంత్రుల కమిటీ ప్రకటించే అవకాశం ఉంది.