టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను ఆయన సొంత వాహనంలోనే పోలీసులు ఏపీకి తరలించారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు సంచలనం కలిగించాయి. సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సుమారు 45 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నెల 27న పదో తరగతి పేపర్ వాట్సప్‌లో లీకైనట్టు కంప్లైంట్ వచ్చింది. డీఈవో ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాం. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేశాం. లీకేజీ వ్యవహారం వెనుక నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నట్టు తెలిసింది. అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం, ఉద్దేశపూర్వకంగా పేపర్స్‌ని లీక్ చేశారు. ఇన్విజిలేటర్స్‌ను మేనేజ్ చేసి, లీకేజీలకు పాల్పడ్డారు. ఇన్విజిలేటర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ ఫోటోలు తీసి, బయటకు పంపారు. వాటికి సమాధానాలు రాసి, మళ్ళీ లోపలికి పంపించారు. ఎక్కువ మార్కుల కోసమే ఇలా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. పట్టుబడిన నిందితులంతా నారాయణలో పనిచేస్తున్నవారే. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణను అరెస్ట్ చేశాం. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నాం.
రికార్డుల వేటలో నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయి. పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయి. నారాయణ సంస్థల పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ జరిగింది. విద్యా వ్యవస్థకు కొద్దిమంది చీడలాగా తయారయ్యారు. ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చ తెచ్చేలా చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. ఈ వ్యవహారంలో మా ప్రభుత్వం సీరియస్‌గా రియాక్టయింది. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని సీఎం జగన్ చెప్పారు. చట్టం పరిధిలో అందరూ సమానమే.
నారాయణ విద్యాసంస్థలంటే ఆషామాషీగా ఉందా? 6 లక్షల మందికిపైగా విద్యార్థులు, 60 వేల మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతను ఆయన పూర్తిగా వదిలేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే, ఛైర్మన్‌ను అరెస్ట్ చేస్తారా? విద్యాశాఖలో లీకేజీపై ఆ శాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. కక్షపూరిత రాజకీయాలకు వైసీపీ ఇప్పటికైనా స్వస్తి పలకాలి.
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్‌ల విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని వదిలేసి, టిడిపి నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు సిఎం గారు.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పూర్తిగా కక్షపూరితం. పరీక్షల నిర్వహణలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం.. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారు. నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడ్ని చేస్తారు? ముందస్తు నోటీసు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా, ఆధారాలు లేకుండా నేరుగా ఆయన్ను అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య కాదా?
నారాయణ కాలేజ్‌కి సంబంధించిన వారు 10వ తరగతి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంలో కీలక పాత్ర వహించారని ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ ఆధారాలతో ఓ కన్‌క్లూజన్‌కి వచ్చింది. అప్పుడు తిరుపతిలో ఉన్న నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్‌ని అదుపులోకి తీసుకొని విచారించాక, వారి వాంగ్మూలం తీసుకున్నాకే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. అయితే, ప్రతిపక్షం వారు దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం, తెలుగుదేశం మీద కక్ష అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళేమో 10వ, ఇంటర్ పరీక్ష పేపర్లు లీక్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.. అరెస్ట్ చేస్తేనేమో తెలుగుదేశానికి అన్యాయం చేస్తున్నారంటూ గగ్గోలు పెడతారు. ఇలాంటి స్కాములకు పాల్పడి, విద్యాసంస్థను వ్యాపారరంగంగా మారుస్తున్న వారిని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆధారాలతో అరెస్ట్ చేశారే తప్ప, అన్యాయంగా కాదు. నారాయణ పక్కా బిజినెస్ మేన్. తాము కావాలని టీడీపీని టార్గెట్ చేస్తే, ఏదో ఒక కారణంతో చంద్రబాబునే అరెస్ట్ చేయిస్తాం కదా! నారాయణ ఏమైనా పెద్ద గొప్పోడా?
మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారు. పరీక్షల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడింది. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు. జగన్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారని మంత్రి బొత్స వెల్లడించారు. టీడీపీ నేతలు రాజకీయంగా మాట్లాడుతున్నారని.. పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కేసులో నారాయణ పాత్రపై పోలీసులు నిగ్గు తేలుస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేసు పెడతారని బొత్స నిలదీశారు.
మాజీ మంత్రి నారాయణ కిడ్నాప్ గురయ్యారని హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నారాయణ వ్యక్తిగత సహాయకులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాయదుర్గం పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షాద్ నగర్ కొత్తూరు సమీపంలో ఏపీ పోలీసుల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. తాము పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు చెప్పడంతో తెలంగాణ పోలీసులు వారి వాహనాలకు దారిచ్చారు. అనంతరం మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు కొత్తూరు నుంచి చిత్తూరుకు తరలించారు.
ఇది కేవలం టెన్త్ క్లాస్‌కు సంబంధించిన అంశం. పేపర్ లీక్ కేసులో పోలీసులు విచారణ చేసిన తర్వాతే టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించడంలో అర్ధం లేదు.
నారాయణ విద్యా సంస్థల నుంచే టెన్త్ పేపర్ వాట్సాప్ అన్ని గ్రూపుల్లో పెట్టారని పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలతోనే పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వాస్తవాలు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. అక్రమాలు జరిగాయనే తెలిసే ఇలా మాట్లాడుతున్నారు. ఇవి నారాయణ విద్యా సంస్థలు కాదు.. నారా విద్యా సంస్థలుగా మారాయి.
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండిస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ అరెస్ట్ రాజకీయకుట్రతో జరిగింది. వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతోంది. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నారాయణ పేరుని పాడుచేయాలని చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నారాయణ విద్యాసంస్థల్ని బలహీనపరిస్తే విద్యార్ధులు నష్టపోతారు. నారాయణను వెంటనే విడుదలచేయాలి.
మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీకుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ పాపాన్ని నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. ఈ ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు.
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం పరువు పోయిందని.. అందుకే ఇప్పుడు ఎదుటివాళ్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారని వివరించారు.
జగన్ ప్రభుత్వం కావాలనే ఏదో ఒక సాకుతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆరోపించారు. జగన్ ఇంట్లో గ్యాస్ లీకైనా.. పరీక్షల్లో పేపర్ లీకైనా దానికి టీడీపీనే కారణమంటే ఎలా అని ప్రశ్నించారు.
కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేత నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యతిచ్చి టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అంశంలో అమరావతి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి బొత్స కలిశారు. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ఆయన సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం.