ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో డబ్బులపై గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్య నారాయణ మాట్లాడుతూ.. నిన్న అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నెట్ లో ఉంచిన వివరాల మేరకు జీపీఎఫ్ ఖాతాలో 800 కోట్లు విత్ డ్రా అయ్యాయని భావిస్తున్నామని, దీని పై ఆర్ధిక శాఖ అధికారులను నిన్ననే కలిసే ప్రయత్నం చేశామన్నారు. ఈ రోజు దీని పై మరికొంత సమాచారాన్ని సేకరించి లేఖ ద్వారా ఆర్ధిక శాఖ అధికారులకు తెలియజేశామని, అయితే అధికారులు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తిగా లేదని ఆయన వెల్లడించారు. మా అనుమతి లేకుండా డీఏ సొమ్ము మార్చి నెలలో డెబిట్, క్రెడిట్ ఎంట్రీ కాలేదని, అంతకు ఏడాది ముందు నుండి పడిన సొమ్ము మార్చిలో తీసేశారన్నారు.
ఇది క్రిమినల్ చర్య తీసుకోవాల్సిన అంశం అని అధికారులకు చెప్పామన్నారు. ఇది మా అకౌంట్‌ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని చెప్పామని, ఇలా చేస్తే వ్యవస్థలపై ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం వుందని ఆయన స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వద్దకు వెళ్ళి మొత్తం వ్యవహరం పై ఫిర్యాదు చేస్తామని, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది మా అకౌంట్ లో సొమ్ము పోయిందని ఆయన ఆరోపించారు. గత ఏడాది అకౌంట్ లోనుండి తీసుకున్న మొత్తం చాలా మందికి రాలేదు, ఇప్పుడు మళ్లీ అదే జరిగనుంది అనే అనుమానం ఉందని, సీఎఫ్ఎంఎస్ రాజ్యాంగ విరుద్ధం అని భావిస్తున్నామన్నారు. దానికి వున్న చట్టబద్దత ఏంటి? సీఎఫ్ఎంఎస్‌లో ఉండి తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?? అని ఆయన ప్రశ్నించారు.