జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమం పై అవగాహన సదస్సులు ముగిశాయి. ఏపీ సచివాలయంలో గత మూడు రోజులుగా కొనసాగిన ప్రజాప్రతినిధులతో సదస్సులు నిర్వహించారు. చివరిరోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దీనికి హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పాఠశాలల మ్యాపింగ్ వల్ల స్కూళ్ళు రూపాంతరం చెందుతాయి.పాఠశాలలు మూతపడటం అనేది జరగదు.తరగతులు, విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారు. స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏదో జరిగిపోతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
ఇప్పుడున్న పాఠశాలలు ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్, హై స్కూల్స్, హై స్కూల్స్ ప్లస్ అని మార్పు చెందుతాయి. త్వరలోనే జిల్లాల వారీగా అధికారులు సదస్సులు పెట్టి మారుతున్న పాఠశాలల స్వరూపాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తారన్నారు మంత్రి సురేష్. సీఎం చేపట్టిన విద్యా సంస్కరణల వల్ల ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
పాఠశాలల మ్యాపింగ్ తరువాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌళిక వసతులు అవసరమో గుర్తించి నాడు- నేడు ద్వారా పనులు పూర్తి చేస్తాం. ఈ విద్యా సంవత్సరం ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పటికి దాదాపు 5 నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నాం. కోవిడ్ భయంతో పాఠశాలలు మూసివేసిన పొరుగు రాష్ట్రాలు కూడా తిరిగి పాఠశాలలు తెరుస్తున్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ విద్యకు ఆటంకం లేకుండా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలన్నారు మంత్రి అంజాద్ బాషా. తక్కువగా ఉండే ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ విషయాన్ని పునరాలోచించాలన్నారు మంత్రి.