ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఓ వైపు పాత పథకాలను షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తూనే.. కొత్తవాటికి శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్లలో పర్యటించనున్న ఆయన.. జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ సందర్భంగా విద్యాదీవెనకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. దీనికోసం.. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 10.10 గంటలకు బాపట్ల చేరుకుంటారు.. ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ బహిరంగ సభ, జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఉండనుంది.. ఇక, మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి..
Read Also: Nagarjuna Sagar: భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత
ఉన్నత విద్యను అభ్యశిస్తున్న వారికి పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ సర్కార్.. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తోంది. దాదాపు రూ. 709 కోట్లను బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందిస్తోంది.. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తూ వస్తోంది. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది.