ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు.
మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారమే తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. మూడురోజుల పాటు స్వగ్రామంలోనే ఎన్వీ రమణ ఉండనున్నారు. అటు సీజేఐ ఎన్వీ రమణ గౌరవార్థం ఏపీ సర్కారు తేనీటి విందును ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే తేనీటి విందులో సీజేఐ ఎన్వీ రమణ, సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా పాల్గొంటారు.