Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల చట్టబద్ధతపై ఏపీ కేబినెట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంపై సోమవారం నాడు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయడంతో ఆయా అంశాలపై భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్లాలో కేబినెట్ చర్చించనుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలపై ఎలా సమాధానం ఇవ్వాలని దానిపై కూడా జగన్ చర్చించనున్నారు.
Read Also: Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
మరోవైపు మూడు రాజధానుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశాలున్నాయి. ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఓపీఎస్ అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. పలు శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై మంత్రివర్గంలో సీఎం జగన్ మంతనాలు జరపనున్నారు. అటు పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం జరపనుంది. మాండూస్ తుఫాను బాధితులకు పరిహారం పంపిణీపైనా కేబినెట్‌లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సీఎం జగన్ సమావేశం కానున్నారు.