ఉత్తరాది తరహాలో ఏపీలోనూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కమలదళం వ్యూహ రచన చేస్తోందా?అందుకు కాపు రిజర్వేషన్ల అంశాన్ని అజెండాగా చేసుకుందా? ఆగస్టు 15లోగా ఏపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టడం దేనికి సంకేతం? బీజేపీ సంకల్పానికి రూట్ మ్యాప్ ఏంటి?
ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశమే బీజేపీ ప్రధాన అజెండా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ కాపు అస్త్రాన్ని సంధించడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇటీవల రాజ్యసభలో కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఆ అంశం రాజ్యసభ, లోక్‌సభల్లో ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దీంతో బీజేపీ అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తుంది అని అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పలువురు కాపు నేతలు, కాపు ఉద్యమ నాయకులతో సమావేశం నిర్వహించారు జీవీఎల్. ఆగస్టు 15లోగా కాపు రిజర్వేషన్లు పూర్తి చేయాలని ఏపీ సర్కార్‌కు ఆయన డెడ్‌లైన్ పెట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా కాపులను బీసీల్లో చేర్చడాన్ని సమర్ధిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీకి కాపుల రిజర్వేషన్ల అంశమే ముఖ్యమైన అజెండా అవుతుందనే చర్చ జరుగుతోంది.
‘కాపు’ అస్త్రంతో హైజంప్.. లాంగ్‌జంప్.. పోల్‌వాల్ట్ ఒకేసారి చేయాలన్నా ఆశలో బీజేపీ?
కాపులను బీసీల్లో చేర్చాలని దశాబ్దాలుగా చేస్తున్న ఉద్యమం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీవ్రరూపం దాల్చింది. గత ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది కూడా. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ఏదైతే చెప్పారో ఇప్పటికీ అదే స్టాండ్ అధికారపార్టీలో ఉంది. అయితే ఏపీలో జనసేనతో కలిసి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తోన్న బీజేపీ.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల అస్త్రాన్ని బయటకు తీసింది. రాజకీయ అండ కోసం కాపు రిజర్వేషన్ల అజెండానే ప్రధానంగా మారింది బీజేపీకి. 19 శాతం వరకు ఉన్న కాపుల మద్దతు దక్కితే హైజంప్.. లాంగ్ జంప్.. పోల్‌వాల్ట్ ఒకేసారి చేసేయొచ్చన్నది బీజేపీ ఆశ. అందుకే దానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశం
ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ ప్రభావంతో.. గత ప్రభుత్వం కాపులను బీసీ ఎఫ్‌లో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాపుల డిమాండ్‌కు అర్థవంతమైన ముగింపు వస్తుందని చంద్రబాబు చెప్పినా.. ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఎక్కడా ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. తాజాగా చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులను సీఎం జగన్ ఎత్తేశారు. దీంతో కేసుల నుంచి విముక్తులైన కాపు సామాజికవర్గాల వారు ముఖ్యమంత్రి జగన్‌కు పాలాభిషేకం చేశారు.
రాష్ట్రంపై బీజేపీ ఒత్తిళ్లు పనిచేస్తాయా?
కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలోనే ఉందనేది కమలనాధుల వాదన. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేశారని.. తద్వారా బీసీల రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు దక్కిందని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఆ విధంగా ఏపీ సర్కార్‌పై కాషాయ శిబిరం ఒత్తిడి పెంచే పనిలో ఉంది. అయితే బీజేపీ లేవనెత్తిన ఈ వాదన ఎంత వరకు కార్యరూపం దాల్చుతుంది? కాపు ఉద్యమకారుల అనుమానాలేంటి? కేంద్రం దగ్గర ఉన్న బిల్లును వెనక్కి పంపుతారా? అన్నది ప్రస్తుతం కీలకం.
2024లోపే ముగింపు ఇస్తుందా.. ఎన్నికల అంశంగా మారుస్తారా?
ఏపీలో ఒక్కో అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్న బీజేపీ.. కాపుల రిజర్వేషన్ అంశానికి 2024 లోపు ముగింపు ఇస్తుందా లేక.. ఎన్నికల హామీగా మారుస్తుందా అనేది మరో చర్చ. పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గానే టేకప్ చేసినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్‌కు ప్రత్యామ్నాయంగా ముద్రగడ పద్మనాభాన్ని తెరపైకి తెచ్చే ఆలోచన బీజేపీ చేసినట్టు కొంతకాలం క్రితం చర్చ జరిగింది. అయితే ముద్రగడ కాపు ఉద్యమానికి గుడ్‌బై చెప్పి దూరంగా ఉంటున్నారు. బీజేపీ తాజా నినాదంపై ఆయన స్పందించలేదు. విభజన హామీల అమలుపై బీజేపీపై అనేక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాపు కాస్తారనే ఆశతో కమలనాథులు ఎత్తుకున్న అస్త్రం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.