Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిని జిల్లా ప్రధాన కేంద్రంగా కొనసాగిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ కృతజ్ఞతా ర్యాలీ మరియు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలతో కలిసి చెక్‌పోస్ట్ శివాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన కృతజ్ఞతాభినందన సభలో పాల్గొన్నారు.
Read Also: Bomb Treat : షాకింగ్.. షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
సభలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గజమాలలు పెట్టి ఘనంగా సన్మానించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో అన్నమయ్య జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, రాయచోటి జిల్లా కేంద్రానికి అత్యంత అనువైన ప్రదేశం అని, నీటి సౌకర్యం మరియు మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయని, జిల్లా ఏర్పాటు కోసం సహకరించిన మంత్రివర్గ ఉపసమితికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతాభినందన సభ నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హాజరవడం తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. రాబోయే మూడున్నర సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.