ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన పూర్తయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 17,500కు పైగా సూచనల పరిశీలన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది.
కొన్ని జిల్లాల్లో మండలాల మార్పులు చేసింది. కుప్పం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. అదనంగా 21.. మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. బాలాజీ జిల్లా పేరు తిరుపతి జిల్లాగా ఖరారు చేసింది. 4వ తేదీన కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. 13 జిల్లాలు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, ఉగాది పర్వదినాన శనివారం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా చేశారు. దీంతో మరో జిల్లా పెరిగింది. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఈ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కోరుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మాట నెరవేర్చుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్ పేరున జిల్లా ఏర్పడి ప్రజల నోళ్ళలో నాననుంది.