ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రేపు సాయంత్రం 5 గంటలకు ఎస్ఎస్సీ ఫలితాలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.. కరోన మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో.. ఆయా సంవత్సరాల్లో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించినవారంతా పాస్ అయిపోయినట్టే.. అయితే, గ్రేడ్లపై కొంత కసరత్తు జరిగింది.. దీని కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్.. ఇక, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది విద్యాశాఖ.. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
కరోనా కాలంలో పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చిన ఏపీ సర్కార్.. ఎలాగైనా.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలతో.. రెండు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక, విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడి, రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో రిజల్ట్స్ వెల్లడికి అనువైన విధానంపై హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇంటర్నల్గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించనున్నారు.