నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయన్నారు. రైతులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు నాబార్డ్ సహకరించాలని కోరగా దీనికి నాబార్డ్ అంగీకరించినట్లు జగన్ తెలిపారు.
తమ హయాంలో రైతులకు రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం చేయాల్సిందల్లా చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ-క్రాప్ నమోదు చేసి పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నామన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా ఉన్నట్లు వివరించారు. గ్రామస్థాయిలోనే ఈ-క్రాపింగ్ చేపడుతూ వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గ్రామీణ నియోజకవర్గాల స్థాయిలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశామని.. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.