రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉంది… అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం లక్ష్యం.. మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారుతుందా? అని మండిపడుతున్నాయి.. అయితే, మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ, రియల్ ఎస్టేట్ కోసం ప్రాంతాలు అభివృద్ధి చేయడం సరికాదని హితవుపలికారు.
Read Also: Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు కొట్టు సత్యనారాయణ.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఆయన.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంది… ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతుంది.. ప్రస్తుత బడ్జెట్‌లో ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు భగవంతుడి ఆశీస్సులు, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్నందువల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కాగా, మూడు రాజధానుల విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే, అది రైతుల పాదయాత్ర కాదు.. కోటీశ్వరుల పాదయాత్ర అంటూ అధికార పక్షం మండిపడుతోంది.