ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.. గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు పర్యావరణ, అటవీ అనుమతులు సాధించిన ప్రభుత్వం.. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఓడరేవుల నిర్మాణం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది ఏపీ సర్కార్.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, రామాయపట్నం ఓడ రేవును రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగా తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.. మొదటి దశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచారు.. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. మరోవైపు, రెండో దశలో రూ.6,904 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.. మొదటి దశలో 24.91 మిలియన్ టన్నులు, రెండో దశలో 113.63 మిలియన్ టన్నుల కార్గోతో కలిపి మొత్తం 138.54 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఈ ఓడ రేవు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు సీఎం జగన్.. ఉదయం 10.55కి భూమి పూజ చేసే ప్రాంతానికి చేరుకోనున్న ఆయన.. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా పోర్టు కోసం భూముల కోల్పోయిన రైతులకు పునరావాస పత్రాలు అందజేస్తారు.. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 2 గంటలకు తన నివాసానికి చేరుకోనున్నారు.. మరోవైపు.. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు, కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.