NTV Telugu Site icon

Hindupur Municipality: హిందూపురం మున్సిపాలిటీలో అసలు ఏం జరిగింది..?

Hindupur Municipality

Hindupur Municipality

Hindupur Municipality: హిందూపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీలో చేరగా.. తాజాగా మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమవుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల తిరుగులేని ఆధిక్యంతో వైసీపీ విజయం సాధించింది. అయితే కూటమి వచ్చిన తర్వాత వాటిని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నుంచే నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత ఆరు నెలలుగా చాలా చోట్ల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపాలిటీలకు ఎన్నిక జరగ్గా.. ఇందులో అతి ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందరి దృష్టి హిందూపురం పైనే ఉంది. వాస్తవంగా ఇక్కడ సంఖ్యాబలంలో మూడోవంతు కూడా లేని తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది…

Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా..?

హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా.. గత మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇక్కడ వైసీపీకి చెందిన ఇంద్రజ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అప్పట్లో హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ సాథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఆయనకు అనుకూలంగా ఉన్న ఇంద్రజని ఛైర్ పర్సన్ చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడం.. అంతకుముందే ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లిపోవడం… హిందూపురం వైసీపీలో ముసలం రాజుకుంది. ప్రస్తుత వైసీపీ సమన్వయకర్తగా ఉన్న దీపికకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ మారారు. ఈ అంతర్గత పోరు జరుగుతుండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల క్రితమే ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ స్థానం ఖాళీ ఏర్పడింది. ఆమెతోపాటు ఏడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత మరికొందరు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు. దీంతో సంఖ్య పరంగా తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వచ్చింది. కానీ, నోటిఫికేషన్ రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుతం చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇవాళ ఛైర్మన్ ఎన్నిక జరిగింది…

Read Also: T. Ram Mohan Reddy: కేటీఆర్ ఇలాగే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బయట తిరగనివ్వరు..

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లను కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సక్సెస్ అవుతూ వచ్చింది. వైసీపీ అధినేత జగన్ కాస్త జోక్యం చేసుకోవడంతో ఆరు మంది కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. కానీ, ఆ తర్వాత వారు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా అర్థమైంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొత్తం 21 మందితో టీడీపీ క్యాంపు రాజకీయాలు చేసింది. పెనుకొండ కేంద్రంగా వారిని క్యాంపుల్లో ఉంచారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి వారిని ఉంచారు. పక్కా వ్యూహంతో వీరు ముందుకెళ్లారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 21 స్థానాలు ఉండాలి. అప్పటికే వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లతో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఎంఐఎం కలిపి 21 స్థానాలు టీడీపీకి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారధి ఓట్లు కలిసి వచ్చాయి. ఇవాళ, తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య ఎన్నిక జరిగింది. హిందూపురంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 11 గంటలకు ఎన్నిక జరగడంతో 23 మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ సీనియర్ కౌన్సిలర్ రమేష్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీలో ఆనందం కనిపించింది. వైసీపీ అభ్యర్థికి కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా వైసీపీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆ పార్టీ చేతిలో ఉన్న మున్సిపల్ పీఠం చేజారిపోయింది. వైసీపీ విప్ జారీ చేసి కౌన్సిలర్లను కట్టడి చేయాలని చూసినా అది ఫలించలేదు.