నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి.
విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు ఆనం. రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్నట్లు అవుతుంది. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలి.. లేకుంటే భవిష్యత్తు ఇబ్బంది తప్పదన్నారు. పంటల కొనుగోళ్లకూ ఇబ్బందులు వుంటాయన్నారు. పాలనా పరమైన అంశాలలోనూ ఇబ్బందులు వస్తాయన్నారు. వద్దు..వద్దూ..అంటున్న కందుకూరు నెల్లూరు లో కలిపారు. సహేతుక కారణాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారే పరిష్కరించాలి. విభజన ప్రక్రియ గందర గోళంగా ఉంది. సున్నితమైన అంశాలను జఠిలం చేయొద్దు. డీలిమిటేషన్ విషయంలో హడావిడి నిర్ణయాలు తీసుకుంటే విద్వేషాలు పెరుగుతాయి. రాష్ట్ర విభజన విషయంలో కొన్ని సంఘటనలు చూశాం..
జిల్లాల విభజనపై అవగాహనా సదస్సు లు నిర్వహించండి.. ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోండి అని కామెంట్ చేశారు ఆనం రామనారాయణరెడ్డి.
దీనిపై తీవ్రంగా స్పందించారు వైసీపీ నాయకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్ లేదు. ఆనం ఫ్యామిలీని తొక్కాలి అనుకుంటే మా నాన్న జనార్ధన్ రెడ్డి హయాంలోనే ఎప్పుడో పక్కన పెట్టేవాడన్నారు. నీ అజెండా ఏంటో అందరికీ తెలుసు నీతి మాలిన రాజకీయాలు చెయ్యకండి. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు ఎక్కడా వ్యతిరేకంగా లేరు. రాపూరు కి ఎమ్మెల్యే గా ఉన్నారు గా ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పండి. ప్రతిపక్షాలు కూడా స్వాగతించారు మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో అందరికి తెలుసన్నారు రాంకుమార్ రెడ్డి. మొత్తం మీద ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ అవుతోంది.