Site icon NTV Telugu

Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టేసిందని అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం ఐదు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను వైసీపీ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు.

Read Also: Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిపై మాత్రమే దృష్టి పెట్టి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, కీలకమైన KK లైన్ ఒడిశాకు వెళ్లిపోతుండటాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంతో సమర్థంగా చర్చించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులో మార్పులకు అంగీకరించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.

అమరావతి నగరంపై కూడా అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లతో నిర్మిస్తున్న అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో “గోస్ట్ క్యాపిటల్”గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి మలేషియాలోని Putrajaya నగరాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, రైల్వే జోన్ కోసం తాను చేపట్టిన దీక్షపై కేసు నమోదు చేయడాన్ని అమర్నాథ్ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

Exit mobile version