Students Carry Tent Equipment: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read Also: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం
స్థానిక యువకులు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. ఆ వీడియో ప్రకారం.. విద్యార్థులు టెంట్ గిన్నెలు, కుర్చీలు, బరువైన వస్తువులు మోసేందుకు ప్రయత్నిస్తూ మధ్య మధ్యలో ఆ బరువులు నేలపై దింపుతూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోడానికి స్కూల్‌కి పంపిన పిల్లల చేత బరువులు మోయించడం సరికాదని.. తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులను శారీరక శ్రమకు గురిచేయడం పాఠశాల నియమావళి ఉల్లంఘన అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.