Ambati Rambabu: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని.. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, అనేక ఘోరాలు చేస్తున్నారని టీడీపీ మీడియాలో రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలా తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ దోచుకున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎంత మందికి ఇచ్చే వారో ప్రజలకు తెలుసు అని.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి ఇస్తున్నామో తెలుసా అని ప్రశ్నించారు.
Read Also: Vijayawada: ఈనెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
ఒకటి రెండు చోట్ల వాలంటీర్లు తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చని.. అలాంటి విషయాలను స్పందనలో రిపోర్టు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. వాలంటీర్లు క్రిమినల్స్ కాదు, దోపిడిదారులు కాదని.. చంద్రబాబు కోసం తప్పుడు కథనాలు రాస్తున్న వారే దోపిడీదారులు అని మంత్రి అంబటి మండిపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు మనసులో మాట బయటపెట్టాడని.. ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని… ముఖ్యమంత్రి పదవి కోసం రాలేదని అంటున్నాడని.. మళ్లీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని ఆయన గతంలో శపథం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
తనను ఆంబోతు అంటూ చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని.. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇదేం ఖర్మ అని ఎంత ప్రచారం చేసినా తమకేం కాదని.. . మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని.. అందుకు కారణం జగన్ సుపరిపాలన అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తన వల్లే ఐటీ రంగం వచ్చిందని.. పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అటు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనంపై చర్చ అనవసరమని.. ప్రచారానికి ఎవరైనా వాహనం సమకూర్చుకోవడం సహజమేనని అంబటి అన్నారు.