NTV Telugu Site icon

Ambati Rambabu: అమరావతి అనేదే పెద్ద కుంభకోణం.. ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. అమరావతి ప్రజా రాజధాని కాదు అని పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారని.. పవన్ కళ్యాణ్ ఆ పుస్తకాన్ని ఒకసారి చదివి అప్పుడు రైతుల పాదయాత్ర గురించి మాట్లాడాలని హితవు పలికారు.

Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?

అయినా అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నాడా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అందులో ఉన్నది అంతా బలిసిన బ్యాచేనని ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకచోట కేంద్రీకరిస్తే ప్రాంతీయ విబేధాలు రావా అని ప్రతిపక్షాలను నిలదీశారు. పాదయాత్ర చేస్తున్న వారు ల్యాండ్ స్కాంలో కూడా ఉన్నారన్నారు. అసైన్డ్ భూములను నారాయణ, గంటా, వారి తాబేదారులు కుంభకోణానికి పాల్పడింది నిజం కాదా అని సూటి ప్రశ్న వేశారు. బీసీ, ఎస్సీల భూములను బెదిరించి లాక్కున్నది నిజం కాదా అన్నారు. పాదయాత్రలో దొంగలతో పాటు దోచుకుందాం అనే ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్‌లో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి ఉద్యమాలు రాకూడదు, ప్రాంతీయ విద్వేషాలు చెలరేగకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానులకు రూపకల్పన చేసిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.