Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్:
• ఈనెల 27న సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
• సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం (స్వర్ణ రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరుగుతుంది.
• అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగింపు జరుగుతుంది.
• అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
కాగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డితో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు.